ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్‌లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ దేశ వ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్షులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ పాల్గొని మాట్లాడుతూ.. గాంధీ కుటుంబాన్ని అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. మా పేపర్‌కు మా పార్టీ డబ్బులు ఇస్తే మనీలాండరింగ్ కేసుకు కిందకి ఎలా వస్తుంది? కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియాగాంధీ కుటుంబంపై అక్రమ కేసులను దేశ ప్రజలు క్షమించరు. అక్రమ కేసులతో దేశ ప్రజల గొంతుకను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ప్రతిపక్షాల మీద 95 అక్రమ కేసులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ బనాయించింది. రాహుల్ గాంధీ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు?..అని మహేష్ కుమార్ ప్రశ్నించారు.