వయస్సులో కేసీఆర్‌ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్‌

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

By Knakam Karthik
Published on : 28 April 2025 3:34 PM IST

Telangana, Congress Government, Tpcc Chief Mahesh kumar, Brs, Kcr

వయస్సులో కేసీఆర్‌ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్‌

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ అధికార కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న వరంగల్‌ జరిగిన మీటింగ్‌ విస్కీ మీటింగ్. అందుకే మహిళలు రాలేదు. వాళ్లు విస్కీ బాటిళ్లకు లొంగరు. దొంగ పాస్‌పోర్టులు సృష్టించి చాలా మందిని విదేశాలకు పంపిన చరిత్ర కేసీఆర్‌ది. కేసీఆర్ నేను సవాల్ విసురుతున్నా.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, మా ఏడాదిన్నర పాలనపై చర్చకు సిద్ధమా? దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబమే. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కేసీఆర్..అని టీపీసీసీ చీఫ్‌ విమర్శించారు.

15000 వేల కోట్ల రూపాయలకు పూర్తి కావాల్సిన మిషన్ భగీరథ 45000 కోట్లు ఎలా అయింది. నీ కుటుంబం దోచుకుంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడిని తీసేశావ్. ఇప్పటికీ కారణం ఏంటి అని చెప్పలేదు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబంలోకి, పోరాటం చేసిన వారికి ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చావా? ఇవాళ కేసీఆర్‌కు జన్మభూమి గుర్తుకు వచ్చిందా? చేసిన మోసాల గురించి కేసీఆర్ చెప్పకుండా అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో వైద్యం మొత్తం..ప్రైమరీ నుంచి నిమ్స్ వరకు సర్వనాశనం చేశారు. కేసీఆర్ హయాంలో రైతులు కల్లాల్లో వడ్ల కుప్పలపైనే పడి చనిపోయారు. సకల జనుల సర్వే చేసి కేసీఆర్ జేబులో పెట్టుకున్నాడు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి లోపాయికార ఒప్పందం ఉంది. కేసీఆర్ వయస్సు రీత్యా పెద్ద మనిషిగా గౌరవిస్తాం కానీ.. పదేళ్ల విధ్వంసాన్ని ఒప్పుకోము..అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.

Next Story