ఎన్నికల టైమ్‌లోనే వారికి హిందుత్వ నినాదం గుర్తుకొస్తుంది, బండిపై టీపీసీసీ ఛీప్ ఫైర్
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik
ఎన్నికల టైమ్‌లోనే వారికి హిందుత్వ నినాదం గుర్తుకొస్తుంది, బండిపై టీపీసీసీ ఛీప్ ఫైర్
కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ టీమ్‌తో పోల్చుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ భారత జట్టు అని.. రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాగ్రెస్ పార్టీది పాకిస్థాన్ క్రికెట్ టీమ్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయనే..ఓట్ల కోసం బండి సంజయ్ మరోసారి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. అయినా.. రాష్ట్ర రాజకీయాలను క్రికెట్‌తో ముడిపెట్టడం కేవలం బీజేపీ నాయకులకే చెల్లిందని విమర్శించారు. ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్లే అన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడటం దురదృష్టకరం" అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
రాష్ట్ర రాజకీయాలు తెలియకుండా మాట్లాడొద్దని బండి సంజయ్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే సంక్షేమానికి పెద్ద పీట వేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే కేవలం ఎన్నికల సమయంలోనే కమలనాథులకు హిందుత్వ నినాదం గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు. పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి బీజేపీ నుంచి గెలచిన 8 మంది ఎంపీలో ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు ఏనాడైనా కష్టపడిన దాఖలాలు ఉన్నాయా అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.