ఆ ప్ర‌య‌త్నం చేయండి.. లేకపోతే కేసీఆర్ పాపంలో మీరు కూడా భాగస్వాములవుతారు : రేవంత్

TPCC Cheif Revanth Reddy Open Letter to CM KCR. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  25 Jan 2023 4:54 PM IST
ఆ ప్ర‌య‌త్నం చేయండి.. లేకపోతే కేసీఆర్ పాపంలో మీరు కూడా భాగస్వాములవుతారు : రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని లేఖ‌లో డిమాండ్ చేశారు. వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం తక్షణం ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చ‌రించారు. బషీర్ బాగ్ లాంటి చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు మన కళ్ల ముందే ఉన్నాయి. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్న వామపక్షాలు.. పేదలపై పడుతున్న భారాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలని.. లేకపోతే కేసీఆర్ పాపంలో వారు కూడా భాగస్వాములవుతారని పేర్కొన్నారు.

మీ తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక‌ సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యం అని విమ‌ర్శించారు. మీ కుటంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయని ఆరోపించారు. మీ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని.. గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యుకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారు. మళ్లీ రెండు నెలల విద్యుత్ బిల్లుల డిపాజిట్ పేరుతో పేదవాడి జేబుకు చిల్లులు పెట్టడానికి తయారయ్యారని విమ‌ర్శించారు.

ఒక వైపు కరోనా, పెట్రోల్ – డీజిల్ – గ్యాస్ ధరల పెరుగుదల, నిత్యావసరాల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి కరువై, ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్యతరగతి వాడిపై దోపిడీకి తెగబడటం క్షమించరాని విషయం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల‌ కరెంటు ఇస్తున్నామని, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని మీరు ఊరు వాడ డప్పు కొట్టుకుంటున్నారు. అదే నిజమైతే విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళతాయి.? అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వమే 20 వేల కోట్ల మేర బకాయి పడిన మాట వాస్తవం కాదా!? అని లేఖ‌లో అడిగారు.

చత్తీస్‌ఘడ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు వల్ల తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినా మీరు పెడ చెవిన పెట్టారని విమ‌ర్శించారు. యాదాద్రీ – భద్రాద్రీ లాంటి ప్లాంట్ల నిర్మాణంలో కాలం చెల్లిన సాంకేతికతను వినియోగిస్తున్నారు. దాని వల్ల భారం తప్ప ప్రయోజనం లేదని గొంతు చించుకున్నా మీరు వినలేదు. మీ కమీషన్లు, మీ కుంభకోణాల కోసమే ఈ ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు అన్నది జగద్విదితం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా లేదు.. బహిరంగ మార్కెట్ లో అడ్డగోలు ధరలకు కరెంటు కొని ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. అదేదో మీ ఘనత అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని లేఖ‌లో విమ‌ర్శించారు.

Next Story