కేటీఆర్‌ను పొగడలేదు..ఏం మాట్లాడినా సంచలనం అవుతుందన్న ఎమ్మెల్యే
By Knakam Karthik Published on 12 Jan 2025 3:49 PM ISTకేటీఆర్‌ను పొగడలేదు..ఏం మాట్లాడినా సంచలనం అవుతుందన్న ఎమ్మెల్యే
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను తాను పొగిడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఏది మాట్లాడిన సంచలనం అవుతుందని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌తో సిటీ ఇమేజ్ పెరిగిందని, అయితే అవినీతి జరగలేదని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఈ వ్యవహారంలో తానేమీ కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంలేదని చెప్పారు. ఈ కార్ రేస్‌పై కేటీఆర్ తన సలహా తీసుకున్నారని దానం నాగేందర్ చెప్పారు. ఆ సమయంలో తన అభిప్రాయం చెప్పానని అన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా విషయంలోనూ తన మాట మీదే ఉన్నట్లు చెప్పారు. హైడ్రా కారణంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా ఆయన విమర్శలు చేశారు. మూసీపై బీజేపీ నేతలు ఒక్క రోజే ముందు ఏసీలు పెట్టించుకుని నిద్ర చేశారని ఆరోపించారు. నిర్వాసితుల నివాసాల్లో కాకుండా బయటి నుంచి తెప్పించిన టిఫిన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తిన్నారని అన్నారు. కేవలం కంటి తుడుపుగానే బీజేపీ నేతలు మూసీ నిద్ర చేశారంటూ దానం నాగేందర్ విమర్శించారు.