ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్..సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
By - Knakam Karthik |
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్..సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మరియు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులు సుప్రీంకోర్టు కోర్టు నెం.11లో, ఐటెం నంబర్లు 47, 47.2గా విచారణకు రానున్నాయి. ప్రధాన పిటిషన్‌తో పాటు అనుబంధ (కనెక్టెడ్) పిటిషన్లను కూడా కోర్టు లిస్ట్ చేసింది. పిటిషన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ శాసనసభ స్పీకర్, ఇతరులను ప్రతివాదులుగా చేర్చారు. పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (యాంటీ-డిఫెక్షన్ లా) ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని పిటిషనర్లు వాదించారు.
అయితే ఫిరాయింపులపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో అనవసర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అనుబంధ పిటీషన్ లలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఇలాంటి జాప్యం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, శాసనసభలో సభ్యుల హోదా విషయంలో స్పష్టత అవసరమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్‌కు స్పష్టమైన గడువు విధిస్తూ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని గతంలో వారు సుప్రీంకోర్టును కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన ఇతర రిట్ పిటిషన్లను కూడా కలిపి విచారించనున్నట్లు కోర్టు సూచించింది. నేటి విచారణలో ఇరుపక్షాల వాదనలు వినే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ మార్పుల అంశంపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల 7గురు శాసనసభ్యుల పై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేడు కోర్టులో సవాల్ చేయనున్నారు.