Telangana: రైతులకు శుభవార్త..యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు
తెలంగాణలో యూరియా కోసం పడిగాపులు కాస్తోన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
Telangana: రైతులకు శుభవార్త..యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు
తెలంగాణలో యూరియా కోసం పడిగాపులు కాస్తోన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఒక ప్రకటనలో తెలియజేశారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ యూరియా కేంద్రాలు 12 వేల వరకు ఉన్నట్లు చెప్పిన ఆయన.. ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని.. అందువల్లే ఆయా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతుందని తెలిపారు.
కాగా రైతుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయశాఖ అదనంగా రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణి చేయడానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నుండి పలు జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు అగ్రికల్చర్ డైరెక్టర్ బి గోపి స్పష్టం చేశారు. కాగా యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాలతో ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ కార్యాలయం నుండి మానిటరింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సీజన్ వరకే రైతు వేదికల్లో యూరియా పంపిణి కొనసాగనున్నట్లు తెలిపారు.