హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ దాఖలు చేసిందని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఉన్న మొత్తం 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయని, బీఆర్ఎస్-23, కాంగ్రెస్-13, ఎంఐఎం-49 ఉన్నాయి. మాకు బలం లేకపోవడం కారణంగానే బరిలో నిలవలేదని పేర్కొన్నారు. అప్పుడు బీజేపీ గెలుపు ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో నిలపలేదు. మేము బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, రాదు.. మేము తటస్థంగా ఉన్నాం, అలా అని ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు..అలాంటప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి మద్దతు తెలుపుతుందా..అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
మీ ఇద్దరి రాజకీయ అవగాహన మేరకే నామినేషన్ వేశారా? బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వైఖరిపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శల నేపథ్యంలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడికి బినామీగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతుందని మంత్రి పొన్నం ఆరోపించారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపిందని ఇప్పుడు కూడా బీజేపీకి అంతర్గత మద్దతు తెలిపేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.