సంక్రాంతి తర్వాత.. తెలంగాణలో ఊపందుకోనున్న రాజకీయ కార్యక్రమాలు
Telangana to witness political activities after Sankranti.హైదరాబాద్: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణతో పాటు దేశంలోని 9 రాష్ట్రాల్లో
By అంజి
హైదరాబాద్: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణతో పాటు దేశంలోని 9 రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత రాజకీయ కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో తమ ఉనికిని, రాజకీయ బలాన్ని చాటుకునేందుకు ప్రతి రాజకీయ పార్టీ వ్యూహరచనలో నిమగ్నమై ఉంది. కాగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరయ్యే తన జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ తొలి మహాసభను ఖమ్మంలో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి సోమవారం ప్రగతి భవన్‌లో జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో సమావేశమై బహిరంగ సభను విజయవంతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు జనవరి 19న హైదరాబాద్‌లో సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తదితర నేతలు సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని ప్రధాని కార్యక్రమాలను సమీక్షించి, బహిరంగ సభ జరిగే స్థలాన్ని కూడా పరిశీలించారు. బీజేపీ జాతీయ నాయకత్వానికి ఈసారి ఉత్తర భారతం నుంచి నిరాశే ఎదురవుతోందని, అందుకే కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశం వైపు దృష్టి సారించిందని అంటున్నారు. కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మరోసారి తన సత్తా చాటాలని, తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలపై చాలా ఆశలు పెట్టుకుంది.