Telangana Polls: రాజాసింగ్‌పై బీఆర్‌ఎస్ ఎవరిని రంగంలోకి దించనుందంటే?
గోషామహల్ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్‌ని అధికారికంగా ప్రకటించడంతో, గోషామహల్ నుండి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయని బీఆర్‌ఎస్ నాయకత్వంపై అందరి దృష్టి ఉంది.
By అంజి
Telangana Polls: రాజాసింగ్‌పై బీఆర్‌ఎస్ ఎవరిని రంగంలోకి దించనుందంటే?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడంతో పాటు గోషామహల్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో, గోషామహల్ నుండి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయని బీఆర్‌ఎస్ నాయకత్వంపై అందరి దృష్టి ఉంది. రాజా సింగ్ 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. నిజానికి 2014 ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన ఏకైక బీజేపీ అభ్యర్థి ఆయనే. 2018లో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది.
గోషామహల్ హైదరాబాద్ నగరంలోనే ఉన్నందున బీఆర్‌ఎస్‌కి కీలకమైన స్థానం. నగరంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. బీఆర్‌ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఏఐఎంఐఎం, బీజేపీ అభ్యర్థిని ఓడించే ప్రయత్నంలో బీఆర్‌ఎస్‌కి మద్దతుగా గోషామహల్ నుండి ఏ అభ్యర్థిని నిలబెట్టలేదు. గోషామహల్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్ కోసం నలుగురు నేతలు నంద కిషోర్ వ్యాస్ బిలాల్ అలియాస్ నందు బిలాల్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, గడ్డియం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. నలుగురు పోటీదారులలో, నంద కిషోర్ వ్యాస్‌కు బిఆర్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం కారణంగా ఎక్కువ అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రస్తుతం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నారు. సీనియర్ నాయకుడు ప్రేమ్ సింగ్ రాథోడ్ 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 44,120 ఓట్లు సాధించగా, టి రాజా సింగ్‌కు 61,806 ఓట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలి జాబితాలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఆ తర్వాత ముగ్గురి పేర్లను ఖరారు చేశారు. అయితే, గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదు. రాజా సింగ్ భవితవ్యం అస్పష్టంగా ఉన్నందున నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు రాజా సింగ్ సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేయడంతో గోషామహల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిని త్వరలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గోషామహల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మొగిలి సునీత బరిలో ఉన్నారు.