ఎన్నికలప్పుడే హిందూ,ముస్లిం అని రెచ్చగొడతారు..బండి సంజయ్‌పై సీతక్క ఫైర్
బండి సంజయ్‌కు నోరు తెరిస్తే, హిందూస్తాన్, పాకిస్తాన్ తప్ప మరో మాట రాదని తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 2:02 PM IST
ఎన్నికలప్పుడే హిందూ,ముస్లిం అని రెచ్చగొడతారు..బండి సంజయ్‌పై సీతక్క ఫైర్
బండి సంజయ్‌కు నోరు తెరిస్తే, హిందూస్తాన్, పాకిస్తాన్ తప్ప మరో మాట రాదని తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. గత పదకొండు సంవత్సరాలుగా యువకులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా బీజేపీలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి.. జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు, యువకులకు జవాబు చెప్పుకోలేక, బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తున్నాడు' అని మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. చెప్పుకోడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదు అని సెటైర్ వేశారు. అసలు పట్టభద్రులకు బీజేపీ ఏం చేసిందో. బండి సంజయ్ చెప్పాలని మంత్రి సీతక్క సవాల్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు.. అని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు" అని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ, దేవుడికి సమర్పించే అగర్‌బత్తిలపై కూడా జీఎస్టీ వేసిందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. ఉన్నత విద్యపై 18 శాతం జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు. ఎన్నికలప్పుడే హిందూ, ముస్లిం అని రెచ్చగొడతారు. బండి సంజయ్.. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించవద్దు" అని మంత్రి సీతక్క సూచించారు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప.. మీరు దేశానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రావాలని సవాల్ చేశారు.
బండి సంజయ్‌కు చెప్పుకోవడానికి ఏం లేదు, మాట్లాడటానికి రెండు మాటలు రావు. పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చి దేశ ఔన్నత్యాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నారు" అని సీతక్క మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి, భారతీయులంతా నా సోదరులే, భారత రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పిన మీరు..అధికారం కోసం విద్వేష ప్రసంగాలు చేయడం అవసరమా అని సీరియస్ అయ్యారు. యువతను మత కొట్లాటల వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ రాజకీయం, భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కు, బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని" మంత్రి సీతక్క పేర్కొన్నారు.