కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రంలోని బీజేపీ సర్కార్.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని గేమ్స్ ఆడుతోందని మంత్రి పొన్నం ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ వారికి ఎదురు నిలిచిన చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. దేశంలో ప్రాణాలు అర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానికి ఉందని పేర్కొన్నారు. ఏళ్లుగా అధికారంలో ఉన్న అవినీతికి పాల్పడకుండా ప్రజా సేవకై అంకితమైన తమ నేతలపై బీజేపీ క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతూ.. కాంగ్రెస్ బలపడుతున్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆయా రాష్ట్రాల్లో రూ.కోట్లలో అవినీతికి పాల్పడినా.. అవన్నీ ప్రధాని మోడీకి కనిపించవని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. ప్రజలందరూ అన్ని పరిణామాలను గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు కేంద్రంలోని బీజేపీకి బుద్ధి చెబుతారు..అని మంత్రి పొన్నం విమర్శించారు.