రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారింది: పొన్నం

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూభేను పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

By Knakam Karthik
Published on : 21 April 2025 10:52 AM IST

Telangana, Ponnam Prabhakar, Congress, Bjp, Narendra Modi, Mp Dhubey

రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారింది: పొన్నం

రాజ్యాంగ సంస్థల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూభేను పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో సేవలు అందించిన వారి మీద ఇష్టానుసారంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వరుస వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మీద ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన ఖురేషిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన నిషికాంత్ దూబే పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నిషికాంత్ దూబే పై చర్యలు తీసుకోకపోతే ఆయన వ్యాఖ్యల వెనుక ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. పార్టీ పెద్దల ప్రోత్బలంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. నిషికాంత్ దూబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ పెద్దలు భావిస్తే తక్షణమే ఆయనను పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణ చేయాలని సూచించారు. పార్లమెంట్ సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిషికాంత్ దూబే ఒక్కరే కాదు గతంలో కూడా చాలామంది బీజేపీ నేతలు రాజ్యాంగబద్ధ సంస్థలపై వ్యక్తులపై, వ్యవస్థలపై తీవ్రంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

గతంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, బండి సంజయ్ లాంటి వారు కూడా రాజ్యాంగ బద్ద సంస్థలపై, వ్యక్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుకు చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తుంది.. నిషికాంత్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించినప్పుడు సస్పెండ్ చేయడానికి భయమెందుకు? అని ప్రశ్నించారు. మీకు చట్టాల పట్ల అభ్యంతరం ఉంటే రివ్యూ పిటిషన్ వేసుకొని కోర్టుల్లో వాదించుకోవచ్చన్నారు. ప్రధానికి గాని బీజేపీ పెద్దలకు గాని రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా రాజ్యాంగ సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో పని చేసిన ఖురేషి పట్ల వ్యాఖ్యలు చేసిన దుభే పై చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

Next Story