కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారని అన్నారు. తాము కమిటీ రిపోర్టును బీరువాలో, ఫ్రిడ్జ్‌లో పెట్టమంటూ సెటైర్ వేశారు. ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు కుల గణనలో వివరాలు ఇవ్వలేదని.. కల్వకుంట్ల ఫ్యామిలీతో ఎమ్మెల్సీ కవిత మినహా ఎవరూ వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ఆరోపించారు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలను వదిలిన వారూ ఉన్నారని ఎద్దేవా చేశారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలనే వివరాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు.
బలహీనవర్గాల కోసం అన్ని పార్టీలు రేపు అసెంబ్లీలో తమ వాదన వినిపించాలని.. కులగణన ఒక ఉద్యమం తరహాలో చేశామన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలిందన్న మంత్రి పొన్నం.. కేబినెట్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశరు. కులగణన చేస్తామని మాట ఇచ్చామని, చేసి చూపించామని చెప్పారు. కుల గణన కోసం పోరాటం చేసిన వారందరికి హ్యాట్సాప్ చెబుతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. బీసీ సోదరులు అందరూ రేపు ఉత్సవాలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు.