ఆ ప్రక్రియ స్టార్టయింది..అందరినీ ఢిల్లీకి తీసుకెళ్తాం: మంత్రి పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik
ఆ ప్రక్రియ స్టార్టయింది..అందరినీ ఢిల్లీకి తీసుకెళ్తాం: మంత్రి పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని తెలంగాణ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి మొదటి వారంలో శాసనసభలో చట్టం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో కేవలం 3.1 శాతం మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదని చెప్పారు.
ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్.. రెండో విడత కులగణన సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే విధంగా సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా కులగణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. తమిళనాడు తరహా షెడ్యూల్-9 పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని మోడీ, తెలంగాణలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం కూడా ఈ బిల్లుకు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండొద్దని కోరుకునే వారిని.. తాను సర్వేలో పాల్గొనాలంటూ బ్రతిమిలాడబోమని.. వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఏంటో తనకు తెలియని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలంతా కూడా సర్వేలో పాల్గొనేలా వారిలో చైతన్యం నింపాలని బీసీ సంఘాల నేతలు, మేధావులను కోరుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.