కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది..అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ లోని నోవొటెల్‌లో కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే సీఎల్పీ సమావేశానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇదే అంటున్నారు. పదేళ్లు అధికారంలో అనుభవించిన వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చాలని తహతహలాడుతున్నారు. కొత్త ప్రభాకర్ కేసీఆర్ ఆత్మ. కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ గజ్వేల్‌కు ఇన్‌చార్జిగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో కొల్లగొట్టిన భూములు బయటికి వస్తాయి. అక్రమంగా సంపాదించిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.
ప్రజా బలంలేని బీఆర్ఎస్ రూ.వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోంది. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనే. కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయి. ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అన్ని పరిణామాలను గమనించాలి. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే పని చేస్తారని నమ్ముతున్నా. ఇందిరమ్మ ప్రభుత్వంపై తండ్రీకొడుకులు కుట్రలు చేస్తున్నారు..అని మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు.