ప్రకృతి విపత్తును బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై హరీష్ రావు మాట్లాడుతున్నారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్, ఎస్‌ఎల్‌బీసీని ఎందుకు పెండింగ్‌లో పెట్టింది.? ఎందుకు తవ్వి వదిలేశారు. తక్కువ లాభం వస్తుందనా? అని ప్రశ్నించారు. ఎకరాకు లక్ష రూపాయలు అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎస్‌ఎల్‌బీసీని పెండింగ్ పెట్టారు. అద్భుతం జరిగితే తప్ప.. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీ వాళ్లు అప్రమత్తం చేయకపోతే 40 మంది వరకు చనిపోయేవారు. అని చెప్పారు.
ఎస్‌ఎల్‌బీసీ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు. శవాల మీద పేలాలను బీఆర్ఎస్ ఏరుకుంటుంది. పాలమూరు రంగారెడ్డిలో ఆరుగురు చనిపోతే కేసీఆర్, సంబంధిత మంత్రి హరీష్ రావు సందర్శించారా? కొండగట్టు బస్సు ప్రమాదంలో 70 మంది చనిపోతే కేసీఆర్, హరీష్ రావు వెళ్లి పరామర్శించారా? ఎస్‌ఎల్‌బీసీ దగ్గరకు వెళ్లి రాజకీయాలు చేయడం ఎందుకు అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఇప్పటికైనా హరీష్ రావు శవరాజకీయాలు మానుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు.