తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందుకు సంబంధించి సమాచారం ఇచ్చింది. జులై 16న ఢిల్లీకి రావాలని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం ఉంటుందని పేర్కొంది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు ఇప్పటికే లేఖ రాశారు.