ప్రచారం తప్ప తెచ్చిందేంటి? సీఎం రేవంత్ దావోస్ టూర్‌పై కవిత ఎద్దేవా

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు

By -  Knakam Karthik
Published on : 19 Jan 2026 1:32 PM IST

Telangana, CM Revanthreddy, Davos Tour, Congress Government, Kavitha, Telangana Jagruti President

ప్రచారం తప్ప తెచ్చిందేంటి? సీఎం రేవంత్ దావోస్ టూర్‌పై కవిత ఎద్దేవా

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సీఎంపై ఇలా రాసుకొచ్చారు.' దావోస్ ట్రిప్ దండగ, ఎక్కే విమానం - దిగే విమానం .. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి ముఖ్యమంత్రి? 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో వచ్చినట్టు మీరు, మీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారు. దావోస్ సమ్మిట్ లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో చేసుకున్న ఎంవోయూలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేతపత్రం విడుదల చేయండి..అని కవిత డిమాండ్ చేశారు.

కాగా జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు శ్రీధర్ బాబు, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోపాటు అదికారుల ప్రతినిధి బృందం పాల్గొననుంది. “ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్” అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లనున్నారు. ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’*ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి ఆవిష్కరించనున్నారు. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైసెస్, రీసెర్చ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పాలసీ లక్ష్యం.

2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను నిలబెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పాలసీలో భాగంగా ప్రతిష్టాత్మక గ్రీన్ ఫార్మా సిటీ రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో కాలుష్య రహితంగా ‘వర్క్ – లివ్ – లెర్న్ – ప్లే’ కాన్సెప్ట్‌తో గ్రీన్ ఫార్మా సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story