హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గంలోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి చొరబడ్డాడని.. అతడిని పట్టుకున్నట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో రెండో రోజు కార్యకలాపాలు ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. సమావేశ మందిరంలో టేబుళ్లపై ఉంచిన ముసాయిదా తీర్మానాలను ఫొటోలు తీస్తుండగా అధికారి పట్టుబడ్డారని సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి విలేకరులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు సమావేశాలను వీడియో తీస్తూ కనిపించారు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నేతలు సదరు అధికారిని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారినని చెప్పగా.. ఆయన తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనను సమావేశాల నుంచి బయటకు పంపేసినట్లు తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావుగా గుర్తించిన అధికారి.. పోలీసు పాస్‌తో సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు పోలీసు అధికారులకు ఎలాంటి అనుమతి లేదని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. "మేము అతన్ని పోలీసు కమిషనర్‌కు అప్పగించాము మరియు అతను తన మొబైల్ ఫోన్‌లో తీసిన ఫోటోలను తొలగించాము" అని ఇంద్రసేనారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.