కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు వ్యవహారంలో కీలక పరిణామం
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.
By Knakam Karthik
ఆ ప్రాజెక్టు కుంగిన కేసులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్‌రావు, ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు..కేసీఆర్, హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని గతంలో భూపాలపల్లి కోర్టులో హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ప్రైవేటు పిటిషన్ చేశారు. ఈ కేసులో కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, మెగా కృష్ణా రెడ్డి, మిగిలిన ప్రతివాదులకు భూపాలపల్లి జిల్లా కోర్ట్ నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిందిగా జూలై 10, 2024లో భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు.
ఈ రోజు విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో వారిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందాడని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని న్యాయమూర్తి చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.