రేపటి నుంచి 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'..కొత్త కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik
రేపటి నుంచి 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'..కొత్త కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. రాష్ట్రంలోని రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మే 5 నుండి జూన్ 13 వరకు రాష్ట్రంలోని సుమారు 1200 గ్రామాలలో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సుమారు 200 పైగా శాస్త్రవేత్తల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు పాల్గొంటాయన్నారు. ఒక్కో బృందం వారి రోజూవారి కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు, వారంలోని పని దినాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాలలోని రైతు వేదికల్లో గాని మరే ఇతర సౌకర్యవంతమైన ప్రదేశంలో గాని రైతులకు యూరియా వాడకం తగ్గించడం, రసాయనాలను జాగ్రత్తగా వాడటం, చెల్లింపు రశీదులను భద్రపరచడం, సాగు నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంచటంపై అవగాహన కల్పిస్తారని..మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఈ అంశాలతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు సూచనలు, సలహాలు అందజేస్తారు. ఒక్కో బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర స్థానిక ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు, సంఘాలు పాల్గొంటారు. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయంలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్స్, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తాయి. విశ్వవిద్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులతో పాటు వివిధ మండలాల్లోని సహ పరిశోధనా సంచాలకులు, కళాశాలల డీన్లు దీనిని పర్యవేక్షిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, కానీ గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోనందున రైతులు ఇలాంటి అవకాశాలను దూరం చేసుకున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల శ్రేయస్సుకోసం, రైతులకు వ్యవసాయ సంబంధిత వివిధ అంశాలపై అవగాహన కల్పించే దిశగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే వారికి వ్యవసాయ సంబంధిత అంశాలపై గల అనుమానాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు.