బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
By - Knakam Karthik |
బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో వాదనలు వినిపించాల్సిగా సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింగ్వీని ఫోన్‌లో సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రేపు హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలని డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా కలిసి కోరారు. ఈ క్రమంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రేపటి హైకోర్టు విచారణపై కీలక సమావేశం నిర్వహించారు.
బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులోను కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. కాగా నిన్న సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ల బృందం ముందు రోజే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించింది. బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోమవారం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి, సిద్ధార్థ దవే లు హాజరు కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తోపాటు మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి వాదనలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.