బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్ ఏర్పాటు, టీజీ సర్కార్ నిర్ణయం

తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik
Published on : 26 March 2025 3:14 PM IST

Telangana, Cm Revanthreddy, Government Of Telangana, Betting And Gaming Apps, SIT

బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్ ఏర్పాటు, టీజీ సర్కార్ నిర్ణయం

తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హోమ్ శాఖ, శాంతి భద్రత, ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం 2021 లో ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. అలాగే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్ లను నిరోధించడానికి, నిషేదించడానికి, చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్‌ (Special Investigation Team)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.

గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామని దీని వలన సమస్య తీరదు అన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని.. ఇందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలు కావాలని.. ఈ బెట్టింగ్ యాప్‌లపై విచారణ చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారికి విధించే శిక్షను పెంచేందుకు వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story