ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌కు 100 సీట్లు పక్కా: ఎర్రబెల్లి దయాకర్

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on  14 Feb 2025 12:13 PM IST
Telugu News, Telangana, Congress, Brs, Errabelli Dayakar Rao

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌కు 100 సీట్లు పక్కా: ఎర్రబెల్లి దయాకర్

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో పార్టీపై విశ్వాసంపై మళ్లీ పెరుగుతుందని.. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పెనుసంఘర్షణ నడుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలసి రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దించేందుకు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సంతృప్తిగా లేనట్లు పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా దీని సంకేతమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మిస్ అవుతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ వందకు పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.

Next Story