నల్లగొండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ప్రజలు ఏమంటున్నారు..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దాదాపుగా చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 7:58 AM ISTనల్లగొండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ప్రజలు ఏమంటున్నారు..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి అతితక్కువ సమయం ఉండటంతో ఇప్పటి వరకు తిరగని ప్రాంతాల్లో నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కసారి కన్నేస్తున్నారు. ఇంకొందరైతే సొంత నియోజవకర్గాల్లో పూర్తిస్థాయిలో పరిస్థితి ఎలా ఉందనేది చూసుకుంటున్నారు. కాగా.. ఈసారి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉండేలా కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రంతో బీఆర్ఎస్ అభ్యర్థి.. సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఉద్యమంలో పోరాటం.. తాను చేసిన పనులను చెబుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక బీజేపీ కూడా తన బీసీ నాయకుడు అజెండాతో ప్రచారం జోరుగా చేస్తోంది. నల్లగొండ జిల్లాలో వామపక్షాలకు కూడా బలం ఉంది. ఇక్కడ సీపీఎం తరఫున ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి బరిలోకి దిగారు. నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారనే దానిపై న్యూస్‌మీటర్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.
నల్లగొండ నియోజకవర్గం:
నల్లగొండ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. నల్లగొండ, తిప్పర్తి, కనకల్, మాడుగులపల్లి మండలాలో ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 17వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయనే చెప్పాలి. అయితే.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచిన పార్టీగా నిలిచింది. మొత్తంగా ఏడుసారల్ఉ కాంగ్రెస్ విజయాలను అందుకుంది. అందులో నాలుగు సార్లు అదికూడా వరుసగా విజయాలు అందుకున్న నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. దివంగత ఎన్టీ రామారావు కూడా 1985లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ.. కొన్నికపరిణామాల నేపత్యంలో కొన్నాళ్లే ఆయన రాజీనామా చేశారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి టీడీపీ మొత్తం మూడుసార్లు ప్రాతినిథ్యం వహించింది. ఈ నియోజకవర్గంలో వామపక్షాలకు ఓటు బ్యాంకు ఉంది. ఆ పార్టీలు ఇక్కడ నాలుగు సార్లు గెలుపునందుకున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించగా.. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఆయనకు షాక్ ఎదురైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో కోమటిరెడ్డి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు.
నల్లగొండ బరిలో ఉన్న అభ్యర్థులు:
నల్లగొండ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికే మరోసారి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. కంచర్ల భూపాల్‌రెడ్డి 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. రెండోస్థానంలో నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీచేసినా ఆయనకున్న బలం ద్వారా రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి టికెట్ అందుకుని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి మరోసారి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టికెట్ అందుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు నల్లగొండ జిల్లాను కంచుకోటగా మార్చిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒకరు. కోమటిరెడ్డి ఇక్కడి నుంచే వరుసగా నాలుగుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2009 నుంచి 2014 వరకు వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. కానీ..2018లో మాత్రం భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూసి రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత భువనగిరి ఎంపీగా పోటీ చేసి అక్కడ నుంచి గెలిచారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఇక్కడ బరిలో దిగింది. నల్లగొండలో తమకు పెద్దగా బలం లేకపోయినా.. మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ను నిలబెట్టింది. కొంతకాలంగా శ్రీనివాస్‌గౌడ్ ఇక్కడ ముమ్మరంగా తిరుగుతూ ప్రజల్లోకి వెళ్లారు. కొన్నిసమయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు. నల్లగొండలో ఒక్కప్పుడు వామపక్షాలకు బలం ఉండేది. కానీ అది రానురానూ తగ్గిపోయింది. కానీ.. ఓటుబ్యాంకు మాత్రం పూర్తిగా లేదని చెప్పలేం. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తుపెట్టుకున్నా... సీపీఎం మాత్రం ఇక్కడ బరిలో ఉంది. ఆ పార్టీ నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి బరిలో నిలబడ్డారు. ఆయనకూ కొంత మేర ఓట్లు పడే అవకాశం లేకపోలేదు.
జోరుగా ప్రధాన పార్టీల ప్రచారం:
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరు గ్యారెంటీల గురించి ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు గెలిచి 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండగా తాను చేసిన పనులను వివరిస్తున్నారు. అంతేకాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పోరాడారు. ఆ విషయాన్ని కూడా కోమటిరెడ్డి బలంగా వినిపిస్తున్నారు. బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టును తానే తీసుకువచ్చానని చెబుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావాలనే తనని ఓడించిందని.. కానీ ప్రజలు తనవెంటే ఉన్నారనీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను భువగిరి నుంచి ఎంపీగా పోటీచేస్తే మరోసారి గెలిపించారని అంటున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే ఆయుధంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకున్నారు అనీ.. బీఆర్ఎస్ హయాంలోనే నల్లగొండ అభివృద్ధి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి రావాలని.. అప్పుడే సంక్షేమం కూడా కొనసాగుతుందని అంటున్నారు కంచర్ల భూపాల్‌రెడ్డి.
మరోవైపు బీజేపీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్‌లు బీసీ నినాదం ఎత్తుకున్నారు. మిగతా పార్టీల అభ్యర్థుల స్థానికతపై ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి, భూపాల్‌రెడ్డి నకిరేకల్ నియోజవకర్గానికి చెందిన వారు అని చెబుతున్నారు. తాము నల్లగొండకు చెందినవారం అంటున్నారు. బీసీలకు గతంలో ప్రాధాన్యత దక్కలేదని బీసీల తరఫున తాము అసెంబ్లీలో పోరాటం చేస్తామంటున్నారు. నల్లగొండలో తమకు ఉన్న ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు సీపీఎం బరిలోకి దిగింది. ముందుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా.. అది కుదర్లేదు. దాంతో.. సీపీఎం ఒంటరిగానే బరిలో దిగింది. నల్లగొండలో సీపీఎం తరఫున పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి నిలబడ్డారు.
నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే...
నల్లగొండలో ప్రజలు కొందరు కాంగ్రెస్‌ను సపోర్ట్ చేస్తుంటే.. ఇంకొందరు బీఆరెస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పుకొస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా సహా కళ్యాణలక్ష్మీ వంటి పథకాలు ఆసరగా ఉంటున్నాయని చెబుతున్నారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీ అనీ.. తాము బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం కోసం మరోసారి కారుకే ఓటువేస్తామని చెబుతున్నారు.
ఇక కొందరు మాత్రం కాంగ్రెస్‌కే తమ ఓటు వేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు తెచ్చినా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందజేయడం లేదని అంటున్నారు. దళితబంధు పథకం తెచ్చినా బీఆర్ఎస్ శ్రేణులకే ఇస్తున్నారని అంటున్నారు. ఈ పథకం కింద కొందరికి కేటాయించినా.. కమిషన్ తీసుకుంటున్నారని వాపోతున్నారు. అందుకే తాము కాంగ్రెస్‌కే ఓటువేస్తామంటున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఎన్నో ఏళ్లుగా నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుబడ్డారని అంటున్నారు. ఆయన్ని గెలిపించి తీరతామంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేయించి.. పార్క్‌లు కట్టినంత మాత్రాన అభివృద్ది జరిగినట్లు కాదని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. మరోవైపు ఇక్కడ బీజేపీకి కొంతమేర అనుకూలమైన ఓట్లు కనిపిస్తున్నాయి. బీసీ నినాదం ఎత్తుకోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందినవారు కమలంవైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు..కేంద్రంలో.. రాష్ట్రంలో ఒకే సర్కార్ ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్‌కే ఇక్కడ హవా కొనసాగుతోందని చెప్పాలి. కోమటిరెడ్డి సీనియర్ నాయకుడు కావడం..ఉద్యమ సమయం నుంచి ఒకేపార్టీలో ఉంటూ అభివృద్ధి కోసం పాటుబడటంతో కోమటిరెడ్డి వైపు గెలుపుపవనాలు వీస్తున్నాయి. కానీ.. ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి డిసెంబర్ 3న ఎలాంటి ఫలితం రానుందనేది చూడాలి.