రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్) మండల అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థి గెలుపు లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై మండల అధ్యక్షులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలను సమాయత్తం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. భవిష్యత్‌లోనూ ఖాళీల భర్తీ పూర్తి చేయనుందని ఈ సందర్భంగా చెప్పారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పట్టభద్రుల్లో, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కాంగ్రెస్ పట్ల నెలకొన్న సానుకూలతను పోలింగ్‌లో ఓట్లుగా మలుచుకునేందుకు పార్టీ నాయకులు కష్టపడాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రేపు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగునుంది. వచ్చే నెల 3వ తేదిన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.