ఆయన అసెంబ్లీకి రావడం లేదు, జీతం నిలిపివేయండి..కేసీఆర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు

ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కు కంప్లయింట్ చేశారు.

By Knakam Karthik  Published on  11 March 2025 6:45 PM IST
Telangana, Kcr, Congress, Brs, TG Assembly, Complaint

ఆయన అసెంబ్లీకి రావడం లేదు, జీతం నిలిపివేయండి..కేసీఆర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు

రేపటి (బుధవారం) నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కు కంప్లయింట్ చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ పొందుతున్న వేతనాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు పొందుతూ శాసనసభకు రావడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ ప్రజల అభ్యున్నతి కోసం విధులను శ్రద్ధగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రజలమైన మా పన్నులతో ప్రతిపక్ష నాయకుడితో సహా ఎన్నికైన ప్రజాప్రతినిధుల జీతభత్యాలు చెల్లింపులు చేస్తారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. తద్వారా ప్రతిపక్ష నేతలగా తన బాధ్యతలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రభుత్వ విధానాలకు జవాబుదారీతనం, నిర్మాణాత్మక విమర్శలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలకు కీలకం. కేసీఆర్ సభకు రాకుండా చర్చల్లో పాల్గొనకుండా తనకు అప్పగించిన ఈ ముఖ్యమైన పాత్రను విస్మరించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. అందువల్ల కేసీఆర్ తన విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేవరకు ఆయన జీతభత్యాల విషయంలో స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు.

Next Story