2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్‌కు తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik
2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్‌కు తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే 2018 తర్వాత తొలిసారిగా నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా హాజరుకాబోతున్నారు. ఈ మీటింగ్ సందర్భంగా భారత్ మండపంలో ప్రధాని మోడీ, ఇతర ముఖ్యమంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అల్పాహారం చేయనున్నారు. అనంతరం ప్రధాని మోడీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి గ్రూప్ ఫొటో కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ ఎజెండాగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలచుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సన సహాయ సహకారాలపై రాష్ట్రం తరపున ప్రత్యేక నివేదికను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు.
కాగా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌తో సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌లో ముందున్న తెలంగాణ ఆ రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం రేవంత్ నీతి ఆయోగ్ సమావేశంలో వివరించనున్నారు. ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్‌లుగా మారుస్తూ మౌలిక వసతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై సీఎం ప్రసంగించనున్నారు.