బీజేపీ కోసం.. బీఆర్‌ఎస్ ఆత్మ బలిదానం చేసుకుంది: సీఎం రేవంత్
బీజేపీని తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్‌ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 5 Jun 2024 9:12 AM GMTబీజేపీ కోసం.. బీఆర్‌ఎస్ ఆత్మ బలిదానం చేసుకుంది: సీఎం రేవంత్
బీజేపీని తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్‌ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీజేపీ గెలిచిన 8 స్థానాల్లోని ఏడింటిలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదని చెప్పారు. తాను మొదటి నుంచి ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్ధిపేటలో హరీశ్ రావు బీఆర్‌ఎస్ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని అన్నారు. తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్.. రాజకీయ జూదగాడు అని విమర్శించారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌తో కలిసి మోదీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే.. మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు.
అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోదీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని చెప్పారు. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్ అన్నారు. ఏక వ్యక్తి పేరుతో మోదీ గ్యారంటీ అని చెప్పడంతోనే బీజేపీకి మెజార్టీ రాలేదని అన్నారు. అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీఏ నేతలు కోరాలని అన్నారు. బీజేపీ 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ సిద్ధాంతం, మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లి మంచి ఫలితాలు సాధించాయని సీఎం రేవంత్ చెప్పారు. కానీ మోదీ గ్యారంటీ అంటూ 2024లో ఎన్నికలకు వెళ్లడంతో దెబ్బ తిన్నారని అన్నారు. ఆయన గ్యారంటీకి వారంటీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆయనను ప్రజలు తిరస్కరించినందున ప్రధాని పదవి మోదీ స్వీకరించవద్దని రేవంత్ అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బూడిదే మిగిలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఈ స్థాయి ఫలితాలు ఎప్పుడూ రాలేదని అన్నారు. అందుకే ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ఉనికి ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో తమ 100 రోజుల పరిపాలనకు రెఫరెండంగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే తమ పాలన మెచ్చి అనుకూలంగా ఓటేసి గెలిపించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ఐదు ఎంపీ సీట్లను అధికంగా గెలిచామని వెల్లడించారు. ప్రజలు కూడా సంతోషకరమైన ఫలితాలు ఇచ్చారని సీఎం రేవంత్ తెలిపారు.