మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం: బండి సంజయ్

మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 4:00 PM IST
telangana, bjp, bandi sanjay,  congress, brs ,

 మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం: బండి సంజయ్

మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అవినీతికి పాల్పడ్డ మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారని అన్నారు. ఇందుకుగాను కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలన్నారు. గురువారం బండి సంజయ్‌ సిరిసిల్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా బీజేపీకి మంచి స్పందన వస్తోందని బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు.. అన్ని గ్రామాల్లో పర్యటించినట్లు చెప్పారు. ఎక్కడకు వెళ్లినా కేంద్రంలో అధికారంలో మరోసారి మోదీ ప్రభుత్వమే రావాలని చెప్తున్నారని అన్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారని చెప్పారు. అలాగే వందల ఏళ్లుగా ఉన్న హిందువల కల అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా మోదీ సారధ్యంలోనే సాకారమైందని బండి సంజయ్ చెప్పారు.

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు అస్సలు ప్రశ్నించడం లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే వరకు ఎదురు చూస్తారా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్‌ కూడా ఆరు గ్యారెంటీలను ప్రజలు మర్చిపోయేలా చేసేందుకు మేడిగడ్డ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఇటు బీఆర్ఎస్‌ కృష్ణా జలాల పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మేడిగడ్డలో నీళ్లు నిలువ చేసే పరిస్థితి లేదనీ.. ఒకవేళ నిలిచినా అది కూడా ప్రమాదమే అని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని బండి సంజయ్ గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుపై కేంద్రం వివరాలు కోరితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వివరాలు ఇచ్చి విచారణకు సహకరించట్లేదని బండి సంజయ్ అన్నారు. దాంతో. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటి అయ్యాయనీ.. ఒకరి మీదకు మరొకరు రాకుండా ఒప్పందం చేసుకున్నారని బండి సంజయ్ అన్నారు.

Next Story