పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు తీర్పుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: హరీష్‌రావు

పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on  30 Jan 2025 5:09 PM IST
Telangana, Supreme Court verdict on PG medical seats, HarishRao, Congress, Brs, Cm Revanth

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు తీర్పుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: హరీష్‌రావు

పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 2025కి తెలంగాణలో 2,924 పీజీ సీట్లు ఉండగా, 50 శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1,462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకే దక్కేవన్నారు. అయితే ఈ తీర్పుతో సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయన్నారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు హరీష్‌ రావు తెలిపారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారిందని అన్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నట్లు హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో ఒక పీజీ స్టుడెంట్ 12,799 మందికి వైద్య సేవలందిస్తే, కర్ణాటకలో 10,573 మందికి, ఏపీలో 15,079 మందికి, తమిళనాడులో 15,123 మందికి, కేరళలో 18,662 మందికి సేవలు అందిస్తున్నారు. ఈ విషయంలో దేశ సగటు 20,460 ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి రెండు మూడు రెట్లు ఉన్నాయి. ఈ నిర్ణయం వలన ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది ప్రశ్నార్థకం అవుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ప్రభుత్వాల లక్ష్యాలు నీరుగారుతాయి. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీష్ రావు ఎక్స్‌లో తెలిపారు.

Next Story