ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 5 వేలు ఇవ్వండి : కేటీఆర్‌

ఆటో రిక్షా డ్రైవర్ల కష్టాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మంగళవారం డిమాండ్ చేశారు

By Medi Samrat  Published on  5 Nov 2024 4:30 PM IST
ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 5 వేలు ఇవ్వండి : కేటీఆర్‌

ఆటో రిక్షా డ్రైవర్ల కష్టాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మంగళవారం డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చిన అధికార పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆటో డ్రైవర్లను విస్మ‌రించి మోసం చేసిందన్నారు. ధర్నా చౌక్‌లో అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న ఆటో డ్రైవర్ యూనియన్లు నిర్వహించిన ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుమారు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారింద‌న్నారు.

రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని.. అయితే ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మరించిందని.. వారి జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. “ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు. అయితే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును నెలకొల్పడంతో పాటు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. మనం మంచి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నారు. వాటిని ఇవ్వాలని కోరుతున్నాం. కానీ గత 11 నెలల్లో వీళ్లు చెప్పిన దానికి చేసిన దానికి ఎంత తేడా ఉందో.. ఏం మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని ఆటో అన్నలను కోరుతున్నా.. రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకొలే.. శాసన సభలో ఆత్మహత్యలు చేసుకున్న వారి పేర్లతో సహా మేము చెప్పాం. వాళ్ల కుటుంబాలను కూడా ఆదుకోలేదన్నారు.

ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న నెలకు వెయ్యితో పాటు రూ. 5 వేలు నెలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వచ్చే శాసన సభ సమావేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను ఆటో డ్రైవర్లు కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్ ను నేరవేర్చాలి. మా ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్ ను తీసివేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అది సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది పెట్టేలా చట్టం చేసింది. అది కూడా రద్దు చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు చాలా హామీలు ఇచ్చి…మీ నోట్లో మట్టి కొట్టింది. రాహుల్ గాంధీ చెప్పిన తియ్యని, కమ్మని మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. ఆటో డ్రైవర్లు ఇక్కడకు ఎక్కువ మంది రాకుండా పోలీసులు ప్రయత్నం చేశారు. దయచేసి పోలీసులు అలా చేయవద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీతోనే కొట్టించే పరిస్థితి తీసుకువచ్చారు. పోలీసులు డ్యూటీ లు చేయండి. కానీ పేద వాళ్ల పట్ల దయతో ఉండండని కోరారు.

సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రేవంత్ రెడ్డి ని తన్నే పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు భయం పట్టుకుంది.. నల్గొండలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ నాయకుడే మనం బయటకు వెళితే తన్నే పరిస్థితి ఉందని చెప్పాడు. మనం ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని చెప్పాడు. రేవంత్ రెడ్డికి పోలీసుల మీద కూడా నమ్మకం లేక సెక్యూరిటీలో నుంచి బెటాలియన్ పోలీసులను తీసేశారని అన్నారు. మార్పు, మార్పు అనుకుంటూ అందరి కొంపలు పుచ్చుకున్నారు ఈ కాంగ్రెసోళ్లు.. నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది.. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా సరే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడతాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని మనం కోరుతున్నాం.. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. మీ తరఫున శాసనసభలోనూ మేము పోరాటం చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

Next Story