తెలంగాణలో సోనియా గాంధీ పోటీ.. పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామ‌ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు.

By Medi Samrat  Published on  18 Dec 2023 4:02 PM IST
తెలంగాణలో సోనియా గాంధీ పోటీ.. పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామ‌ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియ‌జేశారు. సోనియా గాంధీ, మ‌ల్లిఖార్జున్‌ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇత‌ర‌ జాతీయ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పీఏసీలో కీలక నిర్ణయం తీసుకున్నామ‌ని.. తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామ‌ని వెల్ల‌డించారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని.. తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీకు ఋణపడి ఉంటామ‌ని తెలిపారు.

ఆరు గ్యారంటీలపై చర్చించామ‌ని.. మిగిలిన గ్యారంటీలపై అసెంబ్లీలో సీఎం ప్రకటిస్తారని వెల్ల‌డించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్ లో 28న జరుగుతుంది. యాభై వేల మందిని తరలిస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం వివరించారని.. ఇరిగేషన్ అవకతవకలపై ఉత్తమ్ వివరించారని తెలియ‌జేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క‌ ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అన్నారు. ఎలక్ట్రిసిటీ, ఫైనాన్స్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామ‌ని తెలిపారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, హౌసింగ్ పై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేస్తామ‌న్న ఆయ‌న‌.. ఈ నెల 28 నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ ఉంటుంద‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. గ్రామ సభలో లబ్దిదారుల ఎంపిక చేస్తారని వివ‌రించారు. పార్లమెంట్ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించామ‌ని తెలిపారు. నామినేటెడ్ పోస్టులను త్వ‌ర‌లోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పారని షబ్బీర్ అలీ తెలిపారు.

Next Story