PhoneTappingCase: ఇద్దరు బీఆర్ఎస్ నేతలు, సీఎం సోదరుడికి సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది.

By -  Knakam Karthik
Published on : 7 Jan 2026 4:20 PM IST

Telangana, Phone Tapping Case, SIT, BRS leader, Cm Revanth, Kondalreddy, Congress

PhoneTappingCase: ఇద్దరు బీఆర్ఎస్ నేతలు, సీఎం సోదరుడికి సిట్ నోటీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఈ కేసులో దర్యాప్తు పరిధిని మరింత విస్తరించిన సిట్, మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు అందజేయగా, రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించిన సిట్, ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో కేసు కీలక మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని కొండల్ రెడ్డిని నోటీసుల్లో ఆదేశించారు.

సిట్ ప్రాథమిక విచారణలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనతో పాటు కొండల్ రెడ్డి ఫోన్‌లు కూడా టాప్ అయినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ టాపింగ్ జరిగింది, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న అంశాలపై సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, అధికారుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సిట్ దర్యాప్తు వేగం పెరగడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరమయ్యాయి.

Next Story