TSPSC Paper Leak : బండి సంజ‌య్‌కు మ‌రోసారి నోటీసులు ఇచ్చిన సిట్.. రేపు విచార‌ణ‌కు రండి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు సిట్ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2023 12:40 PM IST
Bandi Sanjay, SIT

బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్పీఎస్పీ) ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ కేసులో ఆరోప‌ణ‌లు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. శ‌నివారం ఉద‌యం బండి సంజ‌య్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు అంద‌జేశారు. రేపు అనగా ఆదివారం(మార్చి 26)న సిట్ ఎదుట హాజ‌రుకావాల‌ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

పేపర్ లీక్‌కు సంబంధించి బండి సంజ‌య్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాలు ఇవ్వాల‌ని కోరారు. గత మంగళవారం బండి సంజయ్‌కి సిట్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం(మార్చి 24)న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్నందున హాజ‌రు కాలేన‌ని సిట్‌కు బండి సంజ‌య్ లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మరోసారి సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ మ‌రొక‌రిని అరెస్ట్ చేసింది. మహబూబ్‌న‌గర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో ప‌ని చేస్తున్న ప్ర‌శాంత్ అనే ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. అతడు పేపర్ లీక్ చేసిన వారి నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ గుర్తించింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇచ్చిన స‌మాచారంతో ప్ర‌శాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితుల సంఖ్య 13కి చేరింది.

Next Story