TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ మరొకరిని అరెస్టు చేసింది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 10:53 AM ISTటీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ మరొకరిని అరెస్ట్ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేస్తున్న ప్రశాంత్ అనే ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. అతడు పేపర్ లీక్ చేసిన వారి నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితుల సంఖ్య 13కి చేరింది.
లీక్ చేసినవారి తో పాటు వారికి డబ్బులు చెల్లించి పేపర్ తీసుకున్న అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల కోసం దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. నగదు ఇచ్చిన వారికి పేపర్ ప్రింట్ కాపీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుల ఇళ్లల్లో సిట్ సోదాలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
నిందితులు వీరే.. ఏ1 పులిదిండి ప్రవీణ్ కుమార్, ఏ2 రాజశేఖర్ రెడ్డి, ఏ3 రేణుకా రాథోడ్, ఏ4 లావుడ్యావత్ ఢాక్యా, ఏ5 కేతావత్ రాజేశ్వర్, ఏ6 కేతావత్ నీలేష్ నాయక్, ఏ7 పత్లావత్ గోపాల్ నాయక్, ఏ8 కె.శ్రీనివాస్, ఏ9 కేతావత్ రాజేందర్ నాయక్, ఏ10 షమీమ్, ఏ11 నాలగొప్పుల సురేష్, ఏ12 దామెర రమేష్ కుమార్, ఏ13 ప్రశాంత్. ఇక మొత్తం 19 మందిని సాక్షులుగా సిట్ తేల్చింది. ఈ సాక్షుల్లో శంకరలక్ష్మీ టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్, సత్యనారాయణ టీఎస్పీఎస్సీ అడ్మిన్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీ తదితరులు ఉన్నారు.