తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. సిట్‌పై తనకు నమ్మకం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా నేడు(శుక్రవారం) విచారణకు హాజరు కాలేనని చెప్పారు. సిట్ నోటీసులు తనకు అందలేదని, మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగానే తాను ఈ విషయమై స్పందిస్తున్నట్లు తెలిపారు. తాను సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని భావిస్తే మరో తేదీని చెప్పాలన్నారు. పేపర్ లీక్ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"నా దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వాలని అనుకోవడం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న. నాకు నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తా. నాకు సిట్ నోటీసులు అందలేదు. మీడియాలో వచ్చిన సమాచారం మేరకే నేను స్పందిస్తున్నా. ఈ నెల 24న హాజరుకావాలని కోరినట్లు మీడియా ద్వారా నాకు తెలిసింది. పార్లమెంట్ సభ్యునిగా నేను సభకు హాజరు కావాల్సి ఉంది. నేను ఖచ్చితంగా హాజరు కావాలని సిట్ బావిస్తే మరో తేదీ చెప్పండి." అని లేఖలో బండి సంజయ్ తెలిపారు.