Telangana : వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు.. ఎలా చేశారంటే..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు
By Medi Samrat Published on 5 Sep 2024 3:45 PM GMTతెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఈ మోసానికి పాల్పడిన ముగ్గురిని బుధవారం అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ టిప్స్ ఇస్తూ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. గతంలో స్టాక్ మార్కెట్ ద్వారా లబ్ధి పొందిన బాధితుడు మెసేజ్ పై స్పందించాడు. మోసగాళ్లు AFSL, Upstox, ఇంటర్నేషనల్ బ్రోకర్స్ (IB) వంటి ప్రసిద్ధ కంపెనీల పేర్లతో లింక్‌లను పంపారు. బాధితుడిని WhatsApp గ్రూప్ లో చేర్చారు. ప్రముఖ సంస్థల పేర్లను మోసగాళ్లు ఉపయోగించడం వల్ల బాధితుడికి ఎలాంటి అనుమానం రాలేదు.
ఈ కంపెనీల ప్రతినిధులుగా నటించి, స్కామర్లు స్టాక్ మార్కెట్ సలహాలను అందించి, పెట్టుబడి పెట్టడానికి బాధితుడిని ఒప్పించారు. ఆ లింక్‌లు తనను నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లకు మళ్లించాయని ఆ వృద్ధుడికి తెలియదు. ప్రారంభంలో ఆ వ్యక్తికి స్వల్ప లాభాలను చూపించారు. అతని నమ్మకాన్ని పెంచడానికి కొంత డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించారు. చివరకు బాధితుడు రూ. 13.26 కోట్లు పెట్టుబడి పెట్టగా.. ఆ తర్వాత మోసగాళ్లు స్పందించడం మానేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సెప్టెంబర్ 2న టీజీసీఎస్‌బీకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇదే తరహా మరో మోసం జరిగి ఉందని కూడా తెలుసుకున్నారు.
విచారణలో హిమాయత్‌నగర్‌కు చెందిన హైదరాబాద్ మెట్రోరైలు ఉద్యోగి మహ్మద్ అతిర్‌పాషా(25)కు చెందిన బ్యాంకు ఖాతాలో కొంత భాగం నగదు బదిలీ అయినట్లు టీజీసీఎస్‌బీ గుర్తించింది. విచారణలో హిమాయత్‌నగర్‌కు చెందిన అరాఫత్ ఖలీద్ మొహియుద్దీన్ (25), చార్మినార్ ఫతే దర్వాజాకు చెందిన సయ్యద్ ఖాజా హషీముద్దీన్ (24) అనే మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు తన పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచారని అతిర్‌పాషా అంగీకరించాడు. ఆ తర్వాత ఖాతాలోని నిధులు విత్‌డ్రా చేశారు. క్రిప్టోకరెన్సీగా మార్చి ప్రధాన నిందితుడికి బదిలీ చేశారు. కీలక నిందితుడిని ఇంకా గుర్తించలేదు. అయితే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.