బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
తెలంగాణ బీఎస్పీకి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు.
By Medi Samrat Published on 16 March 2024 3:55 PM ISTతెలంగాణ బీఎస్పీకి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు. కేసీఆర్ తో ప్రవీణ్ భేటీ అయ్యారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. ఇంతలోనే ఆయన బీఎస్పీకి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ పోటీ చేయనున్నారు.
బీఎస్పీని వీడాలనే నిర్ణయాన్ని ఎంతో బాధతో తీసుకున్నానని.. తెలంగాణలో తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో గొప్పదైన బీఎస్పీ ఇబ్బంది పడకూడదనేది తన భావన అని అన్నారు. పొత్తులో భాగంగా ఎన్ని ఒడదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని, కష్టసుఖాలను పంచుకోవాల్సిందేనని అన్నారు. బీఎస్పీ - బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కవిత అరెస్ట్ కూడా ఇందులో భాగమేనని.. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలను ఇవ్వలేనని అన్నారు. తన ఈ ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రవీణ్ అన్నారు. చివరి వరకు బహుజనవాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటానని.. బహుజనుల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. "పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. " అంటూ చెప్పుకొచ్చారు.