ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
By - Knakam Karthik |
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు
తెలంగాణ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతులు, అభివృద్ధి కోసం ఈ నిధులు ఉపయోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. రెండేళ్ల ప్రజా పాలనా వారోత్సవాలు సందర్భంగా 12గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరుగనున్న సభకు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా దాదాపు రూ.1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఓయూకి రెండోసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.
రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గత ఆగస్టులో యూనివర్సీటీలో వివిధ హాస్టళ్ల ప్రారంభోత్సవానికి క్యాంపస్‌కు వచ్చారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రెండోసారి ఓయూ సందర్శన సందర్బంగా చేయబోయే ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.