వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం నాడు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపై ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని కామెంట్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు.. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దొరలకు ఒక నీతి... గిరిజనులకు ఒక నీతా? అని అడిగారు.
మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని అన్నారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అన్నారు.