మంత్రి హరీష్ రావుకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Letter To Health Minister Harish Rao. నిమ్స్ లో కాంట్రాక్టు నర్సుల ఆందోళన, సమస్యల పరిష్కారం గురించి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

By Medi Samrat  Published on  5 April 2022 11:28 AM GMT
మంత్రి హరీష్ రావుకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

నిమ్స్ లో కాంట్రాక్టు నర్సుల ఆందోళన, సమస్యల పరిష్కారం గురించి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో గత పది రోజులుగా కాంట్రాక్టు నర్సులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు. రెగ్యూలర్ ఉద్యోగులతో సరి సమానంగా విధులు నిర్వర్తిస్తోన్న కాంట్రాక్టు నర్సులు తమ కనీస డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతుంటే మీరు పెడ చెవిన పెట్టడం దుర్మార్గమ‌ని అన్నారు. ప్రసూతి సెలవుల దగ్గర నుండి జీతాలకు సంబంధించిన పే స్లిప్పులు కూడా ఇవ్వకపోవడం తీవ్రమైన అన్యాయమ‌ని.. ఇది కట్టుబానిసత్వం కిందకు వస్తుందని అన్నారు.

పేద రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్రే కీలకం. నర్సులు విధులు బహిష్కరిస్తే ఆ ప్రభావం పేదరోగుల వైద్యసేవలపై తీవ్రంగా ఉంటుందని గుర్తుచేశారు. గత పది రోజులుగా నిమ్స్ లో ఇదే జరుగుతోందని.. 423 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించి, నిత్యం ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్నారని అన్నారు. నిమ్స్ యాజమాన్యం కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు కానీ దీనిపై స్పందించకపోవడం బాధాకరమ‌ని అన్నారు. ఏళ్ల తరబడి రెగ్యూలర్ ఎంప్లాయీస్ తో సమానంగా విధులు నిర్వర్తిస్తోన్న ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని నర్సులు ఆరోపిస్తున్నారని అన్నారు.

అటానమస్ నిబంధనల ప్రకారం.. వేతనాలు చెల్లించడం లేదని కూడా వారు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న తమను ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధుల నుండి తొలగించి మళ్లీ తీసుకుంటున్నారని.. దీని వల్ల సీనియారిటీ కోల్పోతున్నామని వాళ్లు వాపోతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. నిమ్స్ లో తమ సమస్యల పరిష్కారం కోసం పది రోజులుగా ఆందోళన చేస్తోన్న స్టాఫ్ నర్సుల సమస్యపై మీరు స్వయంగా దృష్టి సారించాలని కోరారు. వాళ్ల కనీస డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.

మంత్రిగా మీరు స్వయంగా నిమ్స్ కు వెళ్లి వారితో చర్చలు జరిపి.. వాళ్ల డిమాండ్లను ఆమోదించాలని రేవంత్ లేఖ‌లో డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే పేద రోగులకు అందాల్సిన వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుద్ద‌ని.. కనుక తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
















Next Story