ఆ భ‌యంతోనే ఆగమేఘాల మీద పేరు మారుస్తూ లేఖ పంపారు

Revanth Reddy Key Comments On BRS. టీఆర్ఎస్ బంగారు కూలీ వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో తాను పిర్యాదు చేశాన‌ని

By Medi Samrat  Published on  9 Dec 2022 3:13 PM IST
ఆ భ‌యంతోనే ఆగమేఘాల మీద పేరు మారుస్తూ లేఖ పంపారు

టీఆర్ఎస్ బంగారు కూలీ వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో తాను పిర్యాదు చేశాన‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింద‌ని.. అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని.. చర్యలు తీసుకోకుండా టీఆర్ఎస్ పేరు మార్చడానికి వీలు లేదని తాను మళ్ళీ పిర్యాదు చేశాన‌ని.. దీనిపై హైకోర్టు నోటీసు ఇచ్చిందనే.. ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం పేరు మారుస్తూ లేఖ పంపిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కేసు విచారణకు వస్తుందనే భయంతోనే ఇలా చేశారని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదు.. ఇప్పటి వరకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఎందుకు విచారణ చేయడం లేదని ప్ర‌శ్నించారు.

నిజంగా బీజేపీ కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని భావిస్తే.. ఎందుకు కోర్టు ఆదేశాలను అమలు చేయించడంలేదని అడిగారు. ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే.. ఏ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేస్తుందని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చడానికే.. కేసీఆర్ ను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. ఎంఐఎం, ఆప్ పార్టీల్లా జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్ ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోందని అన్నారు.

దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం వెనక కుట్ర దాగుందని అన్నారు. తెలంగాణను, ఆంధ్రాను కలపడానికి మళ్లీ కుట్ర చేస్తున్నారని.. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. గుజరాత్ మోడల్ ను కర్ణాటకలో అమలు చేయాలనుకుంటున్నారని.. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Next Story