తనకు పీసీసీ పదవి ఎలా వచ్చిందో చెప్పిన రేవంత్ రెడ్డి
Revanth Reddy In Nizamabad Meeting. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రాజీవ్ రైతు దీక్ష సభ విజయవంతం చేయడంతో తనకు
By Medi Samrat
నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రాజీవ్ రైతు దీక్ష సభ విజయవంతం చేయడంతో తనకు పీసీసీ పదవి వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ రైతు దీక్ష సభ విజయవంతం చేయడం ద్వారా.. ఆ విషయం ఢిల్లీకి చేరి తనకు పీసీసీ పదవి తనకు వచ్చిందని అన్నారు. సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించారని అన్నారు.
నిజామాబాద్‌లో మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. కేసీఆర్ ఓ సారి ఎమ్మెల్యేగా.. సింగిల్ విండో డైరెక్టర్‌గా నిలబడి ఓడిపోయారని.. అబద్దాలు చెప్పి నిజామాబాద్‌లో గెలిచిన కవిత.. హామీలు నిలబెట్టుకోకపోవడంతో రైతులు నామినేషన్ వేసి ఓడగొట్టారని అన్నారు. ప్రస్తుత ఎంపీ అరవింద్ సైతం పసుపు బోర్డు తెస్తానని మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ దళిత బంధును ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్ ఒడిపోతాడనే భయంతో తిరిగి తెలంగాణ, ఆంధ్ర ప్రజలని రెచ్చ గొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని అన్నారు. త్వరలో గజ్వేల్, నిజామాబాద్‌లలో భారీ సభలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ గురించి దురుసుగా మాట్లాడొద్దని ఎంపీ అరవింద్‌కు సూచన చేశారు రేవంత్.