ప్రజలు కోరుకున్న ఎన్నికలు కావు.. ఆంబోతుల బల ప్రదర్శన : రేవంత్ రెడ్డి
Revanth Reddy Fires On TRS BJP. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు
By Medi Samrat Published on 23 Oct 2021 3:43 PM GMTహుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్ తరుపున వీణవంక, జమ్మికుంట మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు వేల రూపాయల పెన్షన్ వృద్ధులకు ఇచ్చి అదేదో చాలా గొప్ప పని చేస్తున్నామని కేటీఆర్ పోజులు కొడుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తే 40, 50 వేలు నెలకు జీతాలు వస్తే వాళ్లే ఎంతో మందికి ఇచ్చేలా అవుతారు. యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. బర్లు, గొర్లు ఇచ్చి.. మీకు అధికారమా.. అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
ఈ ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కావని.. ఈ ఉప ఎన్నికలలో రెండు అచ్చోసిన ఆంబోతుల బల ప్రదర్శన చేస్తున్నట్లుందని విమర్శించారు. రోడ్డు వెంబడి మొత్తం చూస్తూ వస్తున్నా.. ధాన్యం రోడ్లపై ఎండబెట్టారు. ఈ ప్రభుత్వం ఆ ధాన్యం కొనుగోలు చేసే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. హుజురాబాద్ ప్రాంతంలో ధాన్యం ఇంతలా పండుతున్నదంటే.. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్లనే అని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప.. ఈ ప్రభుత్వం ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిన్రా అని ప్రశ్నించారు.
ఇక్కడ ఇద్దరు నాయకులు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నారు. ఇద్దరు కలిసి తిరిగారు కదా ఎవరి కోసం కొట్లాడారు. నిరుద్యోగుల కోసం కోట్లాడారా.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరాడారా.. గిట్టుబాటుధర కోసం కోట్లాడిండా.. అని ప్రశ్నించారు. ఇద్దరికి భూములు, ఆస్తుల పంపకాల మధ్య గొడవ తప్ప ఏముందని రేవంత్ రెడ్డి అన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెరగడంతో ప్రజలు దోపిడీకు గురవుతున్నారని, ధరల పెరుగుదలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు దొంగలేనని బీజేపీ, టిఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు. 40 రూపాయల పెట్రోల్‌ను 110 రూపాయలకు అమ్ముతున్నారని విమర్శించారు. ఇక్కడ అంతా కాంగ్రెస్ ఉంది కాని.. అభ్యర్ధిని లేట్ చేశామంటున్నారని.. మేనరికంలో ఓ పిల్లవాడు ఉండేవాడు.. లేచి పోతే మంచోన్ని చూసే సరికి లేటయ్యిందని వివరించారు. ఆలస్యంగా వచ్చినా వారంలో నియోజకవర్గం అంత దున్నేరకం మా అభ్యర్థి.. రేయింబవళ్లు దున్నుతాడని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్‌ను ఎవరిని బరిలో నిలిపింది.. గెల్లు శ్రీనును కాదు.. చిల్లు శ్రీను అని ఎద్దేవా చేశారు. గొర్లు, బర్లు మేము పెంచుకుంటే.. కేసీఆర్ కొడుకు బిడ్డలు రాజ్యాలు ఏలుతారా అని ప్రశ్నించారు. ఇవాళ కేటీఆర్ సన్నాయిలు నొక్కునొక్కుతున్నాడని.. నేను ఈటెల గోల్కొండ రిసార్ట్స్ రహస్యంగా కలుసుకున్నట్లు చెబుతున్నాడని.. మే 7వ తేదీ వేం నరేందర్‌రెడ్డి పిల్లగాని లగ్నపత్రిక రాసుకున్నప్పుడు వేల మందిలో కలిసామని.. మేము దొంగ చాటుగా కలవలేదని.. లంగ ముచ్చట్లు మాట్లాడలేదని రేవంత్ అన్నారు.
కేసీఆర్ చేసిన దోపిడీ అంత ఈటెల చెప్పాడు.. ఇంతకాలం నువ్వు అక్కడే ఉన్నావ్ కదా.. నీ మాటలు ఎవరు నమ్మరని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈటెల రాజేందర్ నాతోనే కాదు.. భట్టి విక్రమార్కని, కిషన్‌రెడ్డిని కూడా కలుసుకున్నారని.. ఇవి నువ్వు చెప్పడం కాదు.. నేనే చెబుతున్నా.. వేల మంది ముందు కలుసుకున్నామని రేవంత్ అన్నారు. అయితే ఈటెలను కలవడానికి కిషన్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌కు రావడానికి విమానం సమకూర్చింది మీకు కమీషన్ ఇచ్చే కంట్రాక్టర్ కాదా అని ప్రశ్నించారు.
మా అభ్యర్థి బలమూరి వెంకట్ విద్యార్థుల పక్షాన పోరాటాలు చేశారు. ఇక్కడున్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు బలమూరికి ఓట్లు వేయాలని అన్నారు. ఇంటికో ఓటు బల్మూరి వెంకట్‌కు వేయాలని కోరారు. పింఛన్లు ఇస్తున్నాం.. ఓటు వేయాలని హరీష్‌రావు అడుగుతున్నాడట.. చెట్టంత పెరిగిండు కాని బుద్ది మాత్రం పెరగలేదు.. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే.. వాళ్లు ఇచ్చే బిచ్ఛం ఎవరికి కావాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వెంకట్‌కు ఓటేస్తే 40 ఏళ్ళు ఇక్కడే మీకు అండగా ఉంటాడు.. అంతేకాదు.. మీగొంతుకై పోరాడుతాడని రేవంత్ రెడ్డి అన్నారు.