హుజురాబాద్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవడం లేదు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On TRS. హుజురాబాద్ ఉప ఎన్నిక నేఫ‌థ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసారని

By Medi Samrat  Published on  8 Oct 2021 12:07 PM GMT
హుజురాబాద్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవడం లేదు : రేవంత్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నిక నేఫ‌థ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ యువత ఆకాంక్షల సాధన కోసమే విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించామ‌న్నారు. ఈ ఆలోచనలో భాగంగా యువకుడైన వెంకట్ ను బరిలోకి దించామ‌ని.. మమ అనిపించడానికి తీసుకున్న నిర్ణయం కాదని. ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోవడం లేదని అన్నారు.

టీఆర్ఎస్, బీజేపీ నేతలు మూటలు, ముల్లెలు సందు సందున సారా సీసాలు పంచుతోందని.. ఐదు నెలలుగా కాంగ్రెస్ ఎందుకు అభ్యర్థిని పెట్టలేదని అందరూ అనుకుని ఉంటారని.. మా పోటీ ప్రజా సమస్యలపై మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్, మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగీ పట్టి అడిగేందుకే వచ్చామ‌ని తెలిపారు. అక్రమ సంపాదన కాంగ్రెస్ నాయకుల దగ్గర లేదని.. మేము భూములు ఆక్రమించుకుని ఎక్కడా అమ్ముకోలేదని అన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలకు నచ్చిన నాయకునికి టికెట్ ఇవ్వాలని భావిస్తోందని.. ఆనాడు మహామహ ఉద్దండులు కరీంనగర్ నుంచి ఉన్నా.. విద్యార్థి నాయకునిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు ఎంపీగా టికెట్ ఇస్తే గెలిపించారని.. పొన్నంపై నిలబడిన అతీరథ మహారథులను ప్రజలు బండకేసి కొట్టి ఓడించారని గుర్తుచేశారు. గెలిచిన పొన్నం మీ ఆశలను వమ్ము చేయకుండా తెలంగాణ కోసం పోరాటం చేసారని.. సుష్మా స్వరాజ్ కాళ్లకు దండం పెట్టి తెలంగాణకు సపోర్టు చేయమని పొన్నం ప్రభాకర్ వేడుకున్నారని.. మధుయాష్కీ, పొన్నం పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా.? కేసీఆర్ ఎవరి కాళ్లు మొక్కాడని ప్ర‌శ్నించారు.

2021లో కూడా అదే సంప్రదాయంతో బల్మూరి వెంకట్ ను పోటీ చేయిస్తున్నామ‌ని.. హుజురాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామ‌ని.. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దొంగలు ఎక్కడ చూసినా దోపిడికి పాల్పడుతున్నారని.. దోచుకున్న సొమ్ముతో ఇక్కడ కొనుగోళ్లు చేస్తున్నారని.. పొద్దునొకడు, సాయంత్రం ఒకడు లీడర్లను కొంటున్నారని.. కొన్నోడినే మళ్లీ మళ్లీ కొంటున్నారని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ నుంచి ఓ కసబ్ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరాడని.. పాకిస్థాన్ నుంచి వచ్చిన కసబ్ లాగా.. కాంగ్రెస్ నమ్మి టికెట్ ఇస్తే.. కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడుపోయాడని.. ఈ రోజు నుంచి వాన్ని ఒరే కసబ్ అని పిలువండి. ఆ పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కొడుకులాగా నమ్మి బెడ్ రూంలో పెట్టుకుంటే.. ఆయననే మోసం చేసాడని.. పదవి ఆశ చూపితే పోయినోడికి.. పదవి రాకుండా గవర్నర్ ఆపేశార‌ని అన్నారు. మోడీకి, కేడీకి బుద్ధి చెప్పాలంటే బల్మూరి వెంకట్ ను గెలిపించాలని.. కేసీఆర్ లాంటి నయవంచకుని మెడలు వంచాలంటే వెంకట్ ను గెలిపించాలని కోరారు. హుజురాబాద్ లో విద్యార్థులు, యువకులు కలిపి 60 వేల మంది ఉన్నారని.. మీ ఓటు మీరు వేసుకుంటే వెంక‌ట్‌ మీ ఎమ్మెల్యేగా వస్తాడని అన్నారు.


Next Story