వారి వివరాలు మా డైరీలో రాసుకుంటాం.. అధికారంలోకి వచ్చాక..
Revanth Reddy Fires On KTR. మంత్రి కేటీఆర్ పంపిన టీఆర్ఎస్ గుండాలు తన ఇంటిపై తన అనుచరులపై దాడి చేశారని
By Medi Samrat Published on 22 Sept 2021 12:44 PM ISTమంత్రి కేటీఆర్ పంపిన టీఆర్ఎస్ గుండాలు తన ఇంటిపై తన అనుచరులపై దాడి చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసుల విషయమై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. కొంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించకుండా అటు ఇటు తిప్పుతున్నట్టు సమాచారం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగిస్తే ఊరుకునేది లేదని.. కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరిగిందని.. కొంతమంది బీహార్ కు చెందిన పోలీస్ అధికారులను ఉన్నత స్థాయిలో నియమించి తెలంగాణను బీహార్ రాష్ట్రంగా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తే అధికారుల వివరాలను మా డైరీలో రాసుకుంటామని.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తనకు అదనపు భద్రత కల్పించే విషయంలో మరోసారి కోర్టుకు వెళ్తామని రేవంత్ అన్నారు. గతంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం ఒక్క సంతకంతో తమ పార్టీకి చెందిన వంద మందికి భద్రత కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించినపుడు.. తన భద్రత విషయంలో ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.