అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. మీరు రండి..

Revanth Reddy Fires On KTR. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, మూడెకరాలు భూమి, డబుల్ బెడ్రూమ్ లు

By Medi Samrat  Published on  18 Sep 2021 1:11 PM GMT
అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. మీరు రండి..

తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, మూడెకరాలు భూమి, డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను 3 లక్షల ఎకరాలు లాక్కున్నారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేశామ‌న్నారు. దళిత బస్తీలు, ఆదివాసీ గూడెలకు వెళ్లామ‌ని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటాపై ఇంద్రవెల్లి నుంచి దండుకట్టాం.. నిన్న గజ్వేల్ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కదంతొక్కారని.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు విజయవంతం అయ్యాయని.. కాంగ్రెస్ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేసి విజయవంతం చేశారన్నారు. ఈ స‌భ‌ల ద్వారా మాకు సంపూర్ణ విశ్వాసం కలిగిందని.. కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్ కు పరిమితం అవుతుందని అనిపించిందన్నారు.

సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురు చూస్తోందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేసీఆర్ కుటుంబం మీద విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని.. రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాకు ఆధారాలతో ఫిర్యాదు చేద్దామని అపాయింట్ మెంట్ కోరినా.. సమయం ఇవ్వలేద‌ని.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షాకు బండి సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్ర‌శ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాంజీగోండు గుర్తుకురాలేదా అని ప్ర‌శ్నించారు. బీజేపీ తప్పుడు చరిత్రను మాట్లాడుతోందని.. రాంజీగోండు, కాశిం రిజ్వికి మధ్య వంద సంవత్సరాల తేడా ఉందని అన్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనలో గోండు బిడ్డ సోయం బాబురావు ఫోటో పెట్టలేదని అన్నారు.

తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షాను అపాయింట్ మెంట్ కోరితే అవకాశం ఇవ్వాలేద‌ని అన్నారు. మై హోమ్ రామేశ్వర్ రావు, రాజ్ పుష్పా సంస్థలకు సీఎం కేసీఆర్ తెలంగాణ భూములు అడ్డంగా కట్టబెట్టారన్నారు. దానిపై ఇప్పటికే సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశామ‌న్నారు. అదే హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆహ్వానం పేరుతో.. ఈనెల 16న ఢిల్లీలో చిన్న జీయర్ స్వామి, మై హోం రామేశ్వర్ రావు కలిశారని.. కేసీఆర్ తరుపున లాబీయింగ్ చేసింది వీరేన‌ని.. కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందం ఏంటీ అని ప్ర‌శ్నించారు. భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధాన‌మైంది అంబికా దర్బార్ బత్తిలాగా.. బాద్ షా కు, అమిత్ షా కు మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుసంధానం చేశారని.. కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వొద్దని కోరారు అని ఆరోపించారు.

బీజేపీ లో రెండు వర్గాలు వున్నాయని.. అందులో ఒకటి కేసీఆర్ వర్గం మరొటి వ్యతిరేక వర్గం అని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి చిట్టా నిన్న అమిత్ షా కు బండి సంజయ్ ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. డ్రగ్స్ తో తనకేమీ సంబంధం అని కేటీఆర్ అంటున్నడు.. ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని అన్నారు. కోర్టులో ఎక్సైజ్ శాఖ అఫిడవిట్ వేసింది.. కేసు మూసేయమని.. ఎందుకు భయపడుతుందని అన్నారు. ఈడీ ఈ రోజు రానా, రకుల్ ప్రీత్ సింగ్ ను పిలించింది.. ఆ రోజు ఎక్సైజ్ శాఖ ఎందుకు విచారణ చేయలేదని.. ఎక్సైజ్ విచారణను అడ్డుకున్నది ఎవరు అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. డ్రగ్స్ విషయంలో కేంద్ర సంస్థలకు ఎందుకు సహకరించడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. వైట్ ఛాలెంజ్ లో భాగంగా వస్తా.. మీరు ఇద్దరూ అక్కడికి రండి. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు నమూనాలు ఇద్దాం. వైట్ ఛాలెంజ్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామ‌ని.. యువత పెడధోరణి పట్టకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఛాలెంజ్ విసిరారు.

నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వలేదని.. కేసీఆర్, నరేంద్ర మోదీ మీద కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమేన‌ని అన్నారు. బండి సంజయ్ బడాయి మాటలు బంద్ చెయ్యి.. మీ రిమోట్ కేసీఆర్ చేతిలో ఉంది.. కేసీఆర్ రిమోట్ మీద తెలంగాణలో బీజేపీ నడుస్తోందని ఆరోపించారు. కేటీఆర్ ను ఒక్క మాట అడుగుతున్న.. వైట్ ఛాలెంజ్ ప్రకటిద్దాం. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కి ఛాలెంజ్ విసురుతున్నా.. వారిద్దరూ మరో ఇద్దరికి ఛాలెంజ్ విసరండి. రక్త నమూనాలు, వెంట్రుకలు డాక్టర్లకు ఇద్దాం.. యువతకు రోల్ మాడల్ గా నిలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతరు.. కడుగుతరని శ్రీ శ్రీ చెప్పారని.. దేశద్రోహం , రాజద్రోహం కేసులపై ఎలాంటి చర్చ జరుగుతుందో అందరూ చూస్తున్నారని.. సుప్రీంకోర్టు ఏం కామెంట్స్ చేసిందో తెలుసు కదా.. అని కేటీఆర్‌కు కౌంట‌రిచ్చారు. చట్ట ఆయనకు చుట్టం కాదు.. మాకు తెలుసు. పెట్టమనండి చూద్దామ‌ని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు.

170 ఏళ్ల కింద జరిగిన వాటిని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నిందని.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందే తప్ప.. అమిత్ షా.. పర్యటన దేనికి ఉపయోగపడలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న వాటిని 8 ఏళ్లు అవుతున్న అమలు చేయలేదని.. వాటిని అడిగే దమ్ము వీళ్లకు లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా, రైల్వే కోచ్, బయ్యారం, ఐటీఐఆర్ వంటి వాటిపై ప్రస్తావించలేదని.. బీజేపీ నేతలు చేయరు.. కేసీఆర్ అడగరు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Next Story