నాయ‌కులు లేక‌నే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారు

Revanth Reddy Fires On BJP. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో

By Medi Samrat  Published on  17 Sept 2021 11:02 AM IST
నాయ‌కులు లేక‌నే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారు

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టం అని అన్నారు. బ్రిటిష్ వారి నుంచి భారత్ కు స్వాతంత్ర్య వచ్చినపుడు నిజాం పాలకులు ఇండియాలో విలీనం చేయకుండా స్వతంత్ర్యంగా ఉండాలని లేదా, పాకిస్తాన్ లో విలీనం చేయాలని చూసారు.. అప్పుడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆదేశాలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో జరిపి తెలంగాణను భారత్ లో విలీనం చేశారని అన్నారు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజని, తెలంగాణ కు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది అని తెలిపారు.

జవహార్‌ లాల్ నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగిందని.. ప్రధాన మంత్రి నిర్ణయం హోం శాఖ మంత్రి అమలు చేశార‌ని అన్నారు. బీజేపీ వాళ్ళు తెలంగాణ విలినాన్ని హోం శాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ ది అని చెప్తున్నారని.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేసారని గుర్తుచేశారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఒక్క నాయకులు కూడా లేరని.. అందుకే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, షాయబుల్లాఖాన్, రాంజీ, చాకలి అయిలమ్మ, కొమురం భీం ల పోరాట స్ఫూర్తి తో పని చేస్తామ‌ని తెలిపారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశార‌ని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామ‌న్నారు.


Next Story